అమరావతి, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): నవ్యాంధ్ర రాజధాని అమరావతేనని గతంలో తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గొప్పగా ప్రకటించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చారంటూ విపక్ష తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది. ఒకపక్క తమ పార్టీ నాయకుల ద్వారా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, మరోవైపు ప్రకటనలు జారీచేయడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేస్తూనే సోషల్ మీడియానూ వదలడం లేదు.

గతంలో రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడినప్పుడు, మద్యం ధరలను పెంచినపుడూ ‘జే టాక్సు’ పేరిట ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం తాజాగా రాజధాని విషయంలో ‘జేటర్ను’ పేరిట ఓ వీడియోను తయారుచేసి తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్టుచేసింది. గతంలో జగన్ దగ్గర నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను, ప్రకటనలను క్రోడీకరించి వాటిని పార్టీకి చెందిన నిపుణుల ద్వారా ఎడిటింగ్ చేసి 2.24 నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించింది ప్రచారం విస్తృతం చేసింది.

ప్రస్తుతం మూడు (పరిపాలన, శాసన, న్యాయ) రాజధానుల అంశంపై జాతీయ స్థాయిలో చర్చజరుగుతున్న నేపథ్యంలో టీడీపీ చేపట్టిన ఈ రాజకీయ వ్యతిరేక ప్రచారానికీ ప్రాధాన్యత ఏర్పడిందన్న విషయం ఆయా వీడియోలకు లభిస్తున్న స్పందన బట్టి అర్ధమవుతోంది.

మరోవైపు, ఏపీ రాజధాని అమరావతి అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని ఆ అఫిడవిట్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేసింది. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పి.వి. కృష్ణయ్య ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కృష్ణయ్య పిటిషన్‌పై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, వివిధ ప్రజా సంఘాలు, రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. రాజధానికి సంబంధించిన మొత్తం 32 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

రాజధాని నిధుల వ్యయం పిటిషన్‌ త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రూ.52వేల కోట్లు ఖర్చు చేశారని సీఆర్డీఏ రికార్డును న్యాయవాది మురళీధర్‌ చూపించగా మొత్తం వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ‘‘ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ నిర్మాణం ఆగిందో వివరాలు కావాలి. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టం కదా? కట్టిన భవనాలు వాడకుంటే పాడైపోతాయి కదా? ఆ నష్టం ఎవరు భరిస్తారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే దీనిపై రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. రూ.52వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? రాజధానిలో కట్టిన భవనాల వివరాలు కావాలని కోరింది. కేసు విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.