అమరావతి, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల వింత నాటకాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చి ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ప్రజలను బాధిస్తున్నారని ధ్వజమెత్తారు. బిల్లులు ఆమోదించిన తీరు ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు.

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సవాల్‌కు అధికార పార్టీ నుంచి స్పందనే లేదని, దమ్ము, ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని రాజా పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు చేస్తున్నారని, ప్రశ్నించినవారిపై కేసులు పెట్టి, జైల్లో పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రజల మనిషని, ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని అన్నారు. తామంతా అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యపై నిరంతరం దృష్టిపెడుతున్నామని అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని మరోసారి ఆలపాటి రాజా సవాల్ చేశారు. అమరావతి చరిత్రను వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాటిని దుర్వినియోగం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు ఉన్నాయన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు, అంగీకారంతో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉన్న అమరావతి ప్రాంతాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిగా చేశారన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలు అయ్యేందుకు నాంది పలికేలా మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చి అధికార బలంతో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం బాధాకరమన్నారు. కరోనా సమయంలో పేదలను ఆదుకోవాల్సిన వైకాపా ప్రభుత్వం ఆ పనిని విస్మరించి మూడు రాజధానుల ఏర్పాటుపై దృష్టి సారించడం సిగ్గుచేటన్నారు.

మరోవైపు, రాజధాని అమరావతి పరిధిలోని తుళ్ళూరులో రైతులు గురువారం వినూత్న నిరసనకు దిగారు. కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ దీక్ష శిబిరాల్లోనే నిరసన చేపట్టారు. కేంద్రం ఇప్పటికైనా తన ద్వంద్వ వైఖరి మానుకోవాలన్నారు.