మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ స్పోర్ట్సు కాంప్లెక్సులో ఏర్పాటుచేసిన కొవిడ్ క్వారంటైన్ సెంటరులో రోగులతో యోగా చేయిస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యల ఫలితంగా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ దాదాపు 13.2 ల‌క్ష‌ల‌కుపైగానే కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక నివేదిక స్పష్టంచేస్తోంది. కోలుకునే సగటు రేటు 67.62 శాతంగా నమోదయింది. దేశవ్యాప్తంగా కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో 67.62 శాతానికి సగటు రేటు దూసుకెళ్లింది. మరోవైపు, మ‌ర‌ణాల స‌గ‌టు మ‌రింత త‌గ్గి 2.07 శాతానికి ప‌త‌నమయింది.

కాగా, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్‌-19 రెండో విడత ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.890.32 కోట్లు విడుదల చేసింది. కోవిడ్‌-19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు, ద్రవ్యలభ్యత దిశగా అదనపు ప్రగతి-నియంత్రణ విధాన చర్యలను భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించింది. దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌-19 వ్యాధి నయమైనవారి సంఖ్య 13,28,336కు చేరింది. గత 24 గంటల్లో 46,121 మంది కోలుకున్నారు. వ్యాధి నయమయ్యేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతుండటంతో ప్రస్తుత కోలుకున్న కేసుల మధ్య అంతరం 7,32,835కు చేరడమేగాక కోలుకునేవారి సగటు 67.62 శాతంతో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుత క్రియాశీల కేసులు (5,95,501) 30.31 శాతంగా ఉన్నాయి. వీరంత ఆస్పత్రులలో లేదా ఏకాంత గృహవాసంలో చికిత్స పొందుతున్నారు. ఇక మొత్తం కేసులలో 2020 జూలై 24 నాటికి క్రియాశీల కేసులు 34.17 శాతం కాగా, గణనీయంగా తగ్గుతూ ఇవాళ 30.31 శాతానికి దిగివచ్చాయి. ఇక మరణాల సగటు ప్రపంచ నేపథ్యంతో పోలిస్తే క్రమంగా పడిపోతూ నేడు 2.07 శాతానికి పతనమైంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా తాజా పరిస్థితులు

పంజాబ్ రాష్ట్రంలో ‘మిషన్ ఫతే’ కింద కోవిడ్‌-19పై పోరులో భాగంగా పంజాబ్‌ ఐటీఐ విద్యార్థులు 17 లక్షల మాస్కులు తయారుచేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ ఇతర సాంకేతిక విద్యాసంస్థ కూడా ఈ రికార్డుకు చేరువగా రాకపోవడం విశేషం. కోవిడ్‌-19 నేపథ్యంలో విద్యార్థులకు ఆర్థిక ఒత్తిడినుంచి ఉపశమనం దిశగా హర్యానాలోని J.C.బోస్ శాస్త్ర-సాంకేతిక విశ్వవిద్యాలయం, ఫరీదాబాద్‌కు చెందిన వైఎంసీఏ (YMCA) తమ నిబద్ధతను నిరూపించుకున్నాయి.

ఈ మేరకు ఆర్థికంగా వెనుబడిన వర్గాలతోపాటు ఆపన్నులైన విద్యార్థులకు మద్దతిచ్చే ఒక విధానాన్ని రూపొందించి అమలుచేసింది. ఇందులో భాగా వారు చెల్లించాల్సిన ట్యూషన్‌ ఫీజు 100 శాతాన్ని వదులుకోవడం, ఇప్పటికే చెల్లించినవారికి వాపసు ఇవ్వడమేగాక కుటుంబంలో ఆర్థిక సంక్షోభంవల్ల రుసుములు లేదా బకాయిలు చెల్లించలేని విద్యార్థులు ఈ సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించడం విశేషం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ -19 రోగులతో వ్యవహరించడంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మెడికల్ కాలేజీ తాండా, కాంగ్రా కొన్ని నెలలుగా మెరుగైన పనితీరు కనబరిచాయని గవర్నర్ ప్రశంసించారు.

ఆస్పత్రిని కోవిడ్‌ ప్రత్యేక చికిత్స కేంద్రంగా ప్రకటించనప్పటికీ పరిస్థితిని ఎదుర్కోవటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ మేరకు ప్రారంభంలో ఇక్కడ రోజుకు 107 పరీక్షల సామర్థ్యం ఉండగా, ఇవాళ 700కిపైగా నమూనాలను పరీక్షిస్తుండటం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సదుపాయాన్ని మరింత పెంచాలని ఆయన సూచించారు. ఇక రక్తదాన శిబిరాలను నిర్వహణ కోసం రక్తదాతలను ప్రోత్సహించాలని, ఇతర స్వచ్చంద బృందాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తిరిగివచ్చేవారు గృహనిర్బంధ వైద్య పర్యవేక్షణ కోరేట్లయితే ముందుగా dmoiccitanagar@gmail.comలో నిర్దేశిత పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్ రాష్ట్రంలోని కోవిడ్‌-19పై తౌబల్, కాచింగ్ జిల్లాల ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ తోక్‌చోమ్‌ రాధేశ్యామ్‌ జిల్లాలో మహమ్మారి నియంత్రణ చర్యలపై జిల్లా పాలన యంత్రాంగంతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిజోరం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీచేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది. నాగాలాండ్ రాష్ట్రంలో 82 కొత్త కేసులు నిర్ధారణ కాగా, పరీక్షించిన 606 నమూనాలకుగాను దిమాపూర్‌లో 58, కోహిమాలో 22, ఫేక్ నుంచి 2 వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 2580 క్రియాశీల కేసులున్నాయి. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం తీరప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి, ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం వరకు నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షల్లో 104మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కోవిడ్‌ సంక్రమణ నిరోధం దిశగా షాపులు, మాల్స్, బ్యాంకులలో కొన్ని ఆంక్షలు విధిస్తూ పోలీసుశాఖ కొత్త సర్క్యులర్ జారీచేసింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల కురుస్తున్న భారీ వర్షాలతో కోవిడ్‌ ఉపశమన, పునరావాస కార్యకలాపాలకు సవాలుగా మారాయి. కేరళలో నిన్న 1,195 కొత్త కేసులు నమోదవగా, 1,234మంది కోలుకున్నారు.

ప్రస్తుతం 11,492 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,47,974 మంది పరిశీలనలో ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 195 తాజా కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 4621కు పెరిగింది. ఇందులో ప్రస్తుతం 1743 క్రియాశీల కేసులు కాగా, ఇప్పటివరకూ 70 మంది మరణించారు. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో సమావేశంలో పాల్గొనాల్సినవారిలో 30 మందికిపైగా కోవిడ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో నిన్న 5,175 కొత్త కేసులు నమోదవగా అత్యధికంగా 112 మరణాలు ఒకేరోజు నమోదవడం గమనార్హం. కాగా, ప్రస్తుతం 54,184 క్రియాశీల కేసులుండగా ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 4461కి చేరింది. కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి బి.ఎస్.యెడియూరప్ప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను ఆదేశించారు. ఆ మేరకు తమ నియోజకవర్గాల్లోనే ఉండి, దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ-పునరావాస చర్యలు పటిష్ఠంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నిన్న 5619 కొత్త కేసులు, 100 మరణాలు నమోదవగా 5407 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,51,449; యాక్టివ్‌ కేసులు: 73,958; మరణాలు: 2804గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.350 కోట్లు ఖర్చుచేస్తున్నదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా నమూనాల సేకరణకు సంజీవని బస్సులను ప్రవేశపెట్టామన్నారు.

కోవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న అధికార పార్టీ నాయకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రి లేఖ రాశారు; ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో చికిత్స పొందుతున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిన్న 10,128 కొత్త కేసులు, 77 మరణాలు నమోదవగా 8729 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసులు: 1,86,461; క్రియాశీల కేసులు: 80,426; మరణాలు: 1681గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జ్వరాల క్లినిక్‌లలోగల అవుట్‌ పేషెంట్‌ సదుపాయాలలో పరీక్షల ద్వారా కోవిడ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులకు వైద్య సంప్రదింపుల అవసరంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణలో గత 24 గంటల్లో 2092 కొత్త కేసులు, 13 మరణాలు నమోదవగా 1289 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 535 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 73,050; క్రియాశీల కేసులు: 20,358; మరణాలు: 589; డిశ్చార్జి అయినవి: 52,103గా ఉన్నాయి.

ఇక కేసులలో మరణాల సగటు ఆగస్టు 3న 0.81 శాతం నుంచి కొద్దిగా తగ్గి 0.80గా నమోదైంది. ఇది జాతీయ సగటు 2.09శాతం కన్నా తక్కువ. మహారాష్ట్రలోని పుణె జిల్లా లక్ష కేసుల స్థాయిని అధిగమించింది. 101,262కు చేరింది. ఇక 99,563 కేసులతో థానె తర్వాతి స్థానంలో ఉంది. కాగా, లక్షకుపైగా కోవిడ్ కేసులు నమోదైన ఢిల్లీ, ముంబై, చెన్నైల జాబితాలో ఇప్పుడు పుణె చేరింది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో 1.45 లక్షల క్రియాశీల కేసులున్నాయి. అహ్మదాబాద్‌లోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించారు. మిగిలినవారు నవరంగపురలోని శ్రేయ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది రోగులను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆస్పత్రికి తరలించారు.

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. కోలుకునేవారి సంఖ్య రీత్యా జాతీయ స్థాయిలో అగ్రస్థానంలోగల రాజస్థాన్, ఇటీవల కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేసుల రీత్యా జాబితాలో పైకి వెళ్తోంది. కాగా, రాష్ట్రంలో తొలి 13,000 కేసులు 108 రోజులు పట్టగా, ఇది కేవలం 12 రోజుల్లో రెట్టింపు కావడం గమనార్హం. గత 24 గంటల్లో రాజస్థాన్‌లో 593 కొత్త కేసులు నమోదవగా, క్రియాశీల కేసుల సంఖ్య 13,630గా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 652 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 35,734కు చేరాయి. కాగా, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆయన 7 రోజులపాటు ఏకాంత గృహవాసం చేయాలని ఆస్ప్రతి అధికారులు సూచించారు. గోవాకు వచ్చే పర్యాటకుల కోసం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ తాజా మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం వారు 14 రోజుల నిర్బంధవైద్య పరిశీలనలో ఉండాల్సి ఉంటుంది. అయితే, ఎవరైనా ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ప్రయోగశాల నుంచి 48 గంటల వ్యవధిలో పొందిన కోవిడ్‌ నెగటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుందని పేర్కొంది.