భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్

న్యూఢిల్లీ, ముంబయి, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): జాతీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్‌-19 విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ద్రవ్యలభ్యత మెరుగుతోపాటు ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చే విధంగా రిజర్వు బ్యాంకు ఇవాళ అదనపు ప్రగతి-నియంత్రణ విధాన చర్యలను ప్రకటించింది. ఈ మేరకు కేంద్రబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్ వివరాలు వెల్లడించారు.

‘‘గడచిన వందేళ్లలో శాంతి సమయాన తలెత్తిన ఈ అత్యంత తీవ్ర ఆర్థిక-ఆరోగ్య సంక్షోభం సృష్టించిన అవరోధాల కారణంగా ఏర్పడే ఆర్థిక ఒత్తిడిని ఈ చర్యలు తగ్గిస్తాయన్నారు. సాధారణ పౌరులపై కోవిడ్‌ ప్రభావం తగ్గించడం కోసం బంగారం-ఆభరణాలపై వ్యవసాయేతర అవసరాల కోసం వాటి విలువపై 90 శాతందాకా రుణాలను అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ తరహా రుణాలపై 75 శాతం నుంచి 90 శాతానికి పెంచిన రుణ మంజూరు పరిమితి 2021 మార్చి 31దాకా అమలులో ఉంటుంది.

ఇక గృహనిర్మాణ రంగానికి నిధుల ప్రవాహం మెరుగు దిశగా జాతీయ గృహనిర్మాణ బ్యాంకుకు రూ.5,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యత్వ సౌకర్యం కల్పించింది. మరోవైపు, బ్యాంకింగేతర, సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థలకు నిధుల లభ్యత మెరుగు కోసం నాబార్డు (NABARD)కు రూ.5,000 కోట్ల నిధిని కేటాయించింది. రుణ స్వీకార సంస్థలపై అప్పుల భారం తగ్గించేందుకు అర్హతగల కార్పొరేట్ అప్పులతోపాటు వ్యక్తిగత రుణాల పరిష్కార ప్రణాళిక అమలుకు రుణదాతలను అనుమతించాలని నిర్ణయించింది.’’ అని తెలిపారు.