న్యూఢిల్లీ, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కోవిడ్ మీద పోరులో అంతర్జాతీయ ఉమ్మడి సహకారానికి శ్రీకారం చుట్టారని కేంద్ర సిబ్బంది, పెన్షన్ల వ్యవహారాల శాఖా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో విదేశాలతో అసాధారణమైన అనుబంధం పెంచుకున్నారని, ఇది కోవిడ్ మీద పోరుకు ఎంతగానో అంతర్జాతీయంగా కూడా ఉపయోగపడిందని అన్నారు. ‘కోవిడ్-19 సంక్షోభం – అంతర్జాతీయ సుపరిపాలన’ అనే అంశం మీద వర్కు షాపును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని భారర సాంకేతిక, ఆర్థిక సహకార (ఐటిఇసి) సంస్థ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, జాతీయ సుపరిపాలనా కేంద్రం, పరిపాలనా సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించటం ద్వారా ప్రపంచాన్ని మేల్కొల్పి ఈ సవాలును ఎదుర్కోవాల్సిన అవసరాన్ని చెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

అప్పటికి భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు. ఆయన ముందు జాగ్రత్త, భవిష్యతు గురించి ఆలోచించిన తీరు ఫలితంగానే భారత్ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలిగిందన్నారు. ఇదే నమూనాను అనేక దేశాలు పాటించటాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. అంతర్జాతీయంగా పరస్పర సహకారం గురించి మాట్లాడుతూ, కోటి అమెరికన్ డాలర్లతో ప్రధాని కోవిడ్ అత్యవసర నిధి ఏర్పాటు చేయటంతోబాటు సార్కు, నామ్, జి- 20 తదితర వేదికలమీద ఈ సమస్య గురించి మాట్లాడారని, అనేక దేసాధిపతులతో విడివిడిగా చర్చించారని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద భారత స్థూల జాతీయోత్పత్తిలో 10 శాతం ఉన్న 20 లక్షల కోట్ల రూపాయల పాకేజ్ ప్రకటించటం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచంలో మరే దేశమూ కేటాయించనంత అత్యధిక స్థాయిలో జరిగిందన్నారు. కోవిడ్ అనంతర ప్రపంచ ఆర్థిక స్థితి చూస్తే వేగంగా కోలుకునే దేశాల్లో భారత్ ఒకటిగా నిలవటం ఖాయమన్నారు. దేశాలు ఈ సంక్షోభానికి వ్యతిరేకంగా చేసే పోరులో విజయం సాధించటమన్నది తమ ఆర్థిక వ్యవస్థలను మళ్ళీ గాడిలో పెట్టటం మీదనే ఆధారపడి ఉంటుందన్నారు.

బలమైన సంస్థలు, బలమైన ఈ- గవర్నెన్సు నమూనాలు, సాధికార పౌరులు, మెరుగైన ఆరోగ్య రక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి పిలుపునిచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ మాట్లాడుతూ, కోవిడ్ సంక్షోభం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలమీద చాలా ఎక్కువగా ఉందన్నారు. పరిమితమైన వనరులు, అరకొర ఆరోగ్య, వైద్య మౌలిక వసతులు కూడా అందుకు కారణమయ్యాయన్నారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకొని దేశం లోపలా, బయటా వైద్య, తదితర సాయాలు అందించగలిగారన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిసి వాక్సిన్ తయారీలో కూడా భారత్ చొరవ తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ రెండు రోజుల సదస్సులో మొత్తం 184 మంది పాల్గొంటూ ఉండగా వారిలో రాయబారులు, ఐఎఎస్ అధికారులు, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాకు చెందిన 26 దేశాల ఆరోగ్య నిపుణులు ఉన్నారు. ప్రారంభ సదస్సుకు భారత ప్రభుత్వ డిఎఆర్‌పిజి, డిపిపిడబ్ల్యు కార్యదర్శి డాక్టర్ ఛత్రపతి శివాజి, సుపరిపాలన జాతీయ కేంద్రం డైరెక్టర్ జనరల్ వి. శ్రీనివాస్, విదేశాంగ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి కుమారి దేవయాని ఖోబ్రగేడ్, పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ వర్క్ షాపును విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, పరిపాలనా సంస్కరణలు. ప్రజాఫిర్యాదుల విభాగం, జాతీయ సుపరిపాలనాకేంద్రం ఉమ్మడిగా రూపొందించాయి. ఐటిఇసి దేశాలు భారత్ అనుసరిస్తున్న సుపరిపాలనావిధానాలను అర్థం చేసుకొని అమలు చేయటం ఈ వర్క్ షాప్ లక్ష్యం.