అమరావతి, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి జై కొట్టారని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటున్నారని తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ వ్యక్తిమీద కక్షతో ఐదుకోట్ల మంది ప్రజలను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మంచిపేరు వస్తుందనే ఉద్దేశంతో రాజధాని అమరావతి మార్పు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సవాల్‌కు సీఎం జగన్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అసెంబ్లీని రద్దుచేసి అమరావతిపై ప్రజాభిప్రాయం సేకరించాలని బోండా ఉమ అన్నారు.

మరోవైపు, రాజధాని అంశంపై కేంద్రం ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ రాజధాని అంశంలో కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన రాజధాని రైతులు మాట్లాడుతూ కేంద్రం ప్రకటనకు నిరసనగా ఉరితాళ్లు మెడకు తగిలించుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు.

నేను సయితం అంటూ ప్రధాని నరేంద్రమోదీ మట్టీ, నీళ్లు తీసుకువచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారని, దాంతో తాము సంబరాలు చేసుకున్నామన్నారు. ఆ రోజున జగన్ కూడా ప్రభుత్వం మారినా రాజధాని మారదన్నారని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పరిశ్రమలు తెస్తామన్నారు. ఇప్పుడాహామీలు ఏమయ్యాయని మహిళా రైతులు ప్రశ్నించారు. 8 నెలలుగా ఉద్యమం చేస్తున్నామని ఖైదీలకు ఉరి తీసే ముందు ఆఖరి కోరిక ఏంటని అడుగుతారని, కానీ తమ సమస్యలను ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలూదపి రైతులు ప్రశ్నించారు.

రాజధానికి భూములు ఇవ్వడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వాన్ని నమ్మి భావితరాల భవిష్యత్తు కోసం తమ భూములను ఇచ్చామన్నారు. కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలతో తమను ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.